నవ యువ తెలంగాణ:పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యత వుంటుంది. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి. తోటి పోలీసులతో వివాదాలకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. భీమవరంలో ఇద్దరు పోలీసుల తీరు తీవ్ర వివాస్పదమవుతుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో డిపార్ట్మెంట్ పరువు పోతోంది. తాజాగా భీమవరం వన్ టౌన్ స్టేషన్లో సిఐకి కానిస్టేబుల్ కి మధ్య చెలరేగిన వివాదం ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాజాగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

భీమవరం వన్ టౌన్ సిఐ కృష్ణభగవాన్ స్టేషన్లో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడ వారిని అకారణంగా వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా రాజేష్ అనే కానిస్టేబుల్ స్టేషన్లోని మరో లేడీ కానిస్టేబుల్ కు బైక్ పై లిఫ్ట్ ఇస్తున్నాడనే కారణంతో అతన్ని వేధించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయంలో కానిస్టేబుల్ రాజేష్ కు మధ్య ఘర్షణ సైతం చోటు చేసుకుంది. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

విచారణ అనంతరం సీఐ కృష్ణ భగవాన్ ను వెకెన్సీ రిజర్వ్ కు పంపించడంతో పాటు కానిస్టేబుల్ ను భీమవరం నుంచి మొగల్తూరు స్టేషన్ కు బదిలీ చేసారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు చిన్నచిన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధపెడుతూ ఒకరినొకరు కొట్టుకునే స్థితికి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలిసింగ్ తో నేరాలు అదుపు చేయాల్సిన పోలీసుల మధ్య సఖ్యత ఉండట్లేదనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *