వార్డెన్లు, హెచ్ఎం లు దొరికిపోయారు…

  • గిరిజన సంక్షేమ శాఖలో సమాచార హక్కు చట్టం నిర్వీర్యం 
  • దరఖాస్తుదారులను తప్పుదోవ పట్టించే సమాధానాలు 
  • వార్డెన్లు, హెచ్ఎంలు భలే హుషారు….!!
  • అధికారులు, వార్డెన్లు కుమ్మక్కు

భద్రాచలం , ఐటీడీఏ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో ఇటీవల కాలంలో పలు అంశాలపై సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరుతూ ఓ దరఖాస్తు దాఖలైంది. దరఖాస్తుకు 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాల్సి ఉండగా దరఖాస్తుదారుడు కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని ఆదేశిస్తూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పౌర సమాచార అధికారి కె ప్రమీలబాయి సంబంధిత ప్రతిని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలకు, ఆశ్రమ పాఠశాలలకు దరఖాస్తుదారుని ప్రశ్నలతో కూడిన కాపీని పంపించినట్లు సమాచారం. అడిగిన సమాచారం ఇస్తే తమ అవినీతి ఎక్కడ బట్టబయలు అవుతుందోననే భయంతో వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కలిసి తామే గిరిజన సంక్షేమశాఖలోని సంబంధింత వసతిగృహాలకు పౌర సమాచార అధికారులు అయినందున దరఖాస్తుదారున్ని తప్పుదోవ పట్టిస్తూ తాము ఈ సమాచారం ఇవ్వలేమంటూ తమ వ్యక్తిగత గోప్యతకు,వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలుగుతుందనీ, వ్యాపారస్తులకు సంబంధించిన మరియు వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలతో కూడుకొని ఉందనీ, ఈ విషయాలు వెల్లడిస్తే తమకు నష్టం వాటిల్లుతుందని సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తూ తప్పుడు ప్రతిని సృష్టించి దరఖాస్తుదారున్ని తప్పుదోవ పట్టించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వారిచ్చిన నిర్లక్ష్యపు సమాధానాలు ఆఫీసు సిబ్బంది ఖాళీగా లేరనీ, సమయం వృధా అవుతుందనే పేరుతో ఇచ్చిన విస్తుపోయే సమాధానాలను సవాల్ చేస్తూ సంబంధిత దరఖాస్తుదారుడు తగు రీతిలో వీరిపై న్యాయపోరాటం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాలో గతంలో అనేక మార్లు పలువురు పేర్లతో ఇదే శాఖపై ఆర్టీఐ లు వేసి డబ్బులు దండుకున్న ఓ వ్యక్తి , వార్డెన్లు ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో వారిని కాపాడేందుకు ఈ తప్పుడు ప్రతిని సృష్టించడంలో సహకరించినట్లు ఆ శాఖకు సంబంధించిన ఓ వార్డెనే మాట్లాడుతున్న ఫోన్ కాల్ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాము సమాచారం ఇవ్వలేమంటూ, తాము దరఖాస్తుదారుడికి పంపిన ప్రతిని రెవెన్యూ శాఖకు బదిలీ చేయాలంటూ ఉన్న ఓ పదంతో మొత్తం సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. రెవెన్యూ శాఖ సమాచార అధికారికి, గిరిజన సంక్షేమ శాఖకి సంబంధం ఏంటో ఈ పరమానందయ్య శిష్యులే చెప్పాలి. గత కొంతకాలంగా వచ్చిన ఆర్టీఐ లకు ఇదే రీతిలో సమాధానాలు ఇవ్వకుండా నెల లోగా ఏదో ఒకటి పంపించాలనే ఆర్భాటంలో తమకు ఇష్టమొచ్చిన్నట్లు సమాధానం నిరాకరిస్తూ, చట్టాన్ని నీరు గారుస్తూ పలు కేసులు ఎత్తిచూపుతూ రిప్లై పంపుతున్నారు. ఈ సమాధానాలన్నింటినీ చూసిన ఓ సమాచార శాఖా అధికారే ముక్కన వేలేసుకున్నారు, ఇంతలా తప్పుదోవ పట్టిస్తున్న తమ ఈ వైఖరి చూస్తోంటే వసతి గృహాలలో తమ అవినీతి వాస్తవమనే అంచనాకు రాక తప్పదు.

సమాచారం నిరాకరిస్తూ పంపిన నకలు
డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారికి పంపాలని సూచన చేసిన నకలు