సీఎం రేవంత్ ‘ఎక్స్’ అకౌంట్ బ్లూటిక్ మాయం.. హ్యాక్ చేశారంటూ అనుమానాలు, అధికారుల క్లారిటీ!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్ ఉన్న అధికారిక ఖాతా ‘బ్లూ టిక్’ మార్క్ లేకపోవడంతో ఎవరో హ్యాక్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఖాతాకు సంబంధించిన ముఖ్యమంత్రి ప్రొఫైల్ పిక్చర్ లో మార్పు కారణంగా ఇది టెక్నికల్ ఇష్యూ అని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. రెండు రోజుల్లో బ్లూ టిక్ పునరుద్ధరించబడుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఎక్స్ లో ముఖ్యమంత్రి ఖాతా నుంచి బ్లూ టిక్ మార్క్ కనిపించకపోవడంతో నెటిజన్లు షాక్ కు గురయ్యారు.

ఇది హ్యాక్ అయిందా అని కొందరు ఆశ్చర్యపోగా, మరికొందరు బ్లూ టిక్ తొలగించడానికి కారణమేమిటని ప్రశ్నిస్తూ వరుస పోస్టలు చేశారు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం ఖాతాను నిర్వహించే సీఎం సోషల్ మీడియా టీం వివరణ ఇస్తూ ముఖ్యమంత్రి ప్రొఫైల్ పిక్చర్ మార్పు వల్లనే బ్లూ టిక్ పోయిందని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా తమ సమస్యలు, వినతులను పంపవచ్చని తెలియజేసింది. కాగా రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోను పెట్టారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఎక్స్ అకౌంట్ బ్లూటిక్ లేకపోవడంతో పలు అనుమానాలకు దారితీసింది.

కాగా లోక్ సభ ఎన్నికలకు అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీపై బీఆర్ఎస్ బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.ఈ మేరకు ఈసీకి బీఆర్ఎస్ వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నుంచి రేవంత్ రెడ్డిని తక్షణమే నిషేధించాలని, ఎంసీసీని ఉల్లంఘించిన ఆయనపై, కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది.